Shikhar Dhawan: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్

Shikhar Dhawan announces retirement from international cricket
  • అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్రకటించిన గ‌బ్బ‌ర్‌
  • ఒక ఎమోషనల్ వీడియో ద్వారా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన క్రికెట‌ర్‌
  • 2010 నుంచి 2022 వ‌ర‌కు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల‌లో భార‌త్‌కు ప్రాతినిధ్యం
  • మొత్తంగా త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 10వేల‌కు పైగా ప‌రుగులు
టీమిండియా స్టార్‌ క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్రకటించాడు. ఈ మేరకు గ‌బ్బ‌ర్ ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశాడు. 

కాగా, ధావన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ అభిమానుల‌కు ఒక్కసారి షాకింగ్‌గా మారిందనే చెప్పాలి. అయితే, యువ క్రికెట‌ర్ల రాక‌తో చాలా కాలంగా గ‌బ్బ‌ర్‌కు టీమిండియాలో చోటు ద‌క్క‌ని విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరిగింది. అనుకున్న‌ట్టే ఇప్పుడు త‌న‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. 

ఇక 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భార‌త్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన జ‌ట్టులో అత‌డు కీరోల్ పోషించాడు. ఈ టోర్నీలో 5 మ్యాచుల్లోనే గ‌బ్బ‌ర్ ఏకంగా 90.75 స‌గ‌టుతో 363 ప‌రుగులు చేయ‌డం విశేషం. 

"భార‌త్‌ కోసం ఆడాలనే ఎంతో కష్టపడ్డాను, తపించాను. అది సాకార‌మైంది. ఈ ప్రయాణంలో నాకు ఎంతో మంది అండగా నిలిచారు. నా కుటుంబం, చిన్ననాటి కోచ్ ఇంకా పలువురి వల్ల ఈ స్థాయికి వచ్చాను. దేశం తరఫున ఆడినందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను అంత‌ర్జాతీయ‌, డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను, కృతజ్ఞతా భావాన్ని నా వెంట తీసుకువెళ్తున్నాను. నాకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, అలాగే నాకు ప్రేమను పంచి అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. జై హింద్!" అని వీడియోలో ధావన్ చెప్పుకొచ్చాడు.

గ‌బ్బ‌ర్ క్రికెట్ కెరీర్ గ‌ణాంకాలు ఇలా..
శిఖర్‌ ధావన్ టీమిండియాకు 2010 నుంచి 2022 వ‌ర‌కు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. 167 వన్డేల్లో 6,793 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో 2,315 పరుగులు, 68 టీ20ల్లో 1,759 ర‌న్స్ చేశాడు. మొత్తంగా త‌న అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 10వేల‌కు పైగా ప‌రుగులు చేశాడు. అలాగే మొత్తంగా 24 శ‌త‌కాలు బాదాడు. వీటిలో వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచ‌రీలు ఉన్నాయి.

.
Shikhar Dhawan
Team India
Cricket
Sports News

More Telugu News