Thummala: రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

Tummala review on Loan Waiver
  • వ్యవసాయాధికారులు స్వయంగా రైతుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశాలు
  • సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామన్న తుమ్మల
  • ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు వెల్లడి
రుణమాఫీపై క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల నుంచి ఆరా తీశారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించడంపై వ్యవసాయాధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి లేదా రైతు వేదికలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రూ.2 లక్షల లోపు రుణాలను కుటుంబ నిర్ధారణ జరిగిన వారికి మాఫీ చేశామన్నారు. కుటుంబ నిర్ధారణ జరగని 4,24,873 ఖాతాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సమాచార సేకరణకు కొత్త యాప్ ఉపయోగపడుతుందన్నారు.

వివరాలు తప్పుగా నమోదైన 1,44,545 ఖాతాలకు సంబంధించి ఇప్పటికే 41,322 అకౌంట్లను సరి చేసినట్లు చెప్పారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసే మొత్తాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెన్యువల్ అయిన ఖాతాలకు సొమ్మును తిరిగి చెల్లించేలా, మాఫీ అయిన అకౌంట్లకు సంబంధించి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
Thummala
Loan Waiver
Telangana

More Telugu News