సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్ట్‌లపై దాడి... స్పందించిన మహిళా కమిషన్
- కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై దాడి
- కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
- ఈరోజు మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ను కలిసిన జర్నలిస్టులు
- ఘటనపై త్వరగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లేఖ
కొండారెడ్డిపల్లెలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం నేరెళ్ల శారదను కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. తమపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ ఈ జర్నలిస్టులు గురువారం స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వీరిద్దరు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 150 మంది తమను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మీకేం పని అంటూ తమపై దౌర్జన్యానికి దిగారని ఆ జర్నలిస్టులు తెలిపారు. తాము రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలకు సంబంధించిన మెమొరీ కార్డులను లాక్కున్నారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మహిళా కమిషన్‌కు వినతిపత్రం అందించారు.