Uttar Pradesh: యోగి ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు.. ఈ నెల జీతాలు కోల్పోయే ప్ర‌మాదంలో 13 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు!

13 lakh Govt employees may lose August salaries due to Key order in Uttar Pradesh
  • రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు తమ ఆస్తులను ప్రకటించాలని యోగి ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు  
  • ఆస్తుల వివ‌రాలు తెలిపేందుకు ఈ నెల 31 ఆఖ‌రి గ‌డువుగా పేర్కొన్న స‌ర్కార్‌
  • యూపీలో మొత్తం 17.8 లక్షల మంది ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు 
  • ఇప్ప‌టివ‌ర‌కు త‌మ ఆస్తుల‌ను ప్ర‌క‌టించిన కేవ‌లం 26 శాతం మంది ఉద్యోగులు
  • మిగిలిన 13 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించ‌క‌పోతే ఈ నెల జీతాలను కోల్పోయే ప్రమాదం
రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారులు ఆగస్టు 31 లోపు తమ చర, స్థిరాస్తులను ప్రకటించాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది. లేని పక్షంలో వారికి ఈ నెల జీతాలను నిలిపివేస్తామ‌ని హెచ్చ‌రించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ప్రభుత్వ పోర్టల్ మానవ్ సంపదలో 17.8 లక్షల మంది ఉద్యోగులలో కేవలం 26 శాతం మంది మాత్ర‌మే తమ ఆస్తులను ప్రకటించారు. మిగిలిన దాదాపు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు.. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించ‌క‌పోతే ఈ నెలలో వారి జీతాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఉత్తర్వులు అంద‌రికీ వ‌ర్తిస్తాయ‌న్న సీఎస్‌
యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ ఈ ఉత్తర్వును ప్ర‌భుత్వ ఉద్యోగ‌లంద‌రూ క‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని అన్నారు. గడువులోపు తమ ఆస్తుల వివరాలను సమర్పించిన ఉద్యోగుల‌కు మాత్రమే వారి జీతాలు పంపిణీ చేస్తామ‌న్నారు. ఈ నిబంధన అన్ని వర్గాల అధికారులు, ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. తమ ఆస్తులను ప్రకటించని వారు ప్రమోషన్లకు అనర్హులుగా మారే అవకాశం ఉందని ఈ సంద‌ర్భంగా ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

"ఈ చర్య ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి పట్ల మేము జీరో-టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నాం" అని యూపీ మంత్రి డానిశ్ ఆజాద్ అన్సారీ ఎన్‌డీటీవీతో అన్నారు.
Uttar Pradesh
Govt Employees
Yogi Adityanath

More Telugu News