Naga Chaitanya: ఐఆర్ఎఫ్ లో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య‌

Akkineni Naga Chaitanya owns Hyderabad Black Birds franchise in Indian Racing Festival
  • ఆగస్టు 24 నుంచి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్
  • మద్రాస్ రేసింగ్ సర్క్యూట్ లో పోటీలు
  • ఓ జట్టుకు యజమానిగా మారిన నాగచైతన్య
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌ కొత్త ప్ర‌యాణానికి శ్రీకారం చుట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ పోటీ ల్లో పాల్గొనే ఓ జట్టుకు యజమానిగా మారారు. 

చైతూకి ఆటో మొబైల్ రంగం అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వ‌న్ అన్నా చాలా చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో తెలియ‌జేశారు.  త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన  రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేక‌రిస్తుంటారు. 

ఇప్పుడాయన తనకు ఇష్ట‌మైన రంగంలోకి అడుగు పెట్టారు. ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ (ఐఆర్ఎఫ్‌)లో పోటీ ప‌డే హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఫ్రాంచైజీని నాగ చైత‌న్య సొంతం చేసుకున్నారు. దీని వ‌ల్ల ఆయ‌న ఐఆర్ఎఫ్‌ నిర్వ‌హించే ఫార్ములా-4 చాంపియన్ షిప్ లో భాగ‌మ‌య్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగ‌స్ట్ 24న ప్రారంభం కానున్నాయి. 

ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్మాలా వ‌న్‌ను ఎంత‌గానో ప్రేమిస్తాను. ఫార్ములా వ‌న్‌లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ న‌డ‌ప‌టంలోని థ్రిల్ న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ నాకు కాంపిటేష‌న్ కంటే ఎక్కువ అని నేను భావిస్తాను. నా ప్యాష‌న్‌ను చూపించుకునే చ‌క్క‌టి వేదిక ఇద‌ని నేను భావిస్తున్నాను. 

హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌ టీమ్ ను సొంతం చేసుకోవ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మ‌ర‌చిపోలేని అనుభూతినిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియ‌న్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. కొత్త టాలెంట్ బ‌యట‌కు వ‌స్తుంది’’ అని అన్నారు. 

చెన్నైలోని మద్రాస్ రేసింగ్ సర్క్యూట్ లో జరిగే ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న 8 జట్లలో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఒక‌టి. ఇందులో నాగ‌చైత‌న్య భాగం కావ‌టం అనేది స్పీడ్ గేమ్‌కి మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఇంకా ఇందులో అర్జున్ క‌పూర్‌, జాన్ అబ్ర‌హం, మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ గంగూలీ కూడా భాగమ‌య్యారు.
Naga Chaitanya
Hyderabad Black Birds
Indian Racing Festival
Franchise

More Telugu News