National Taskforce: వైద్యుల రక్షణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్: సుప్రీంకోర్టు

Supreme Court Sets Up National Task Force Of Doctors On Hospital Safety
  • ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం కేసు విచారణలో భాగంగా ఏర్పాటు చేసిన సీజేఐ ధర్మాసనం
  • మూడు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం బెంచ్
  • శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టొద్దంటూ బెంగాల్ ప్రభుత్వానికి సూచన
దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈమేరకు మంగళవారం ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరో దారుణం జరిగేంత వరకూ దేశం వేచి ఉండలేదని, డాక్టర్ల రక్షణకు సంబంధించి మరిన్ని ఏర్పాట్లు అవసరమని పేర్కొంది. అదేవిధంగా ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం ఘటనను పొలిటికల్ ఇష్యూగా చేయదల్చుకోలేదని సీజేఐ పేర్కొన్నారు. హత్యాచారం ఘటనకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు బలగాలతో అణచివేసే ప్రయత్నం చేయొద్దంటూ పశ్చిమ బెంగాల్ సర్కారుకు సూచించింది. సీజేఐ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.

టాస్క్ ఫోర్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..
ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ సరైన్ నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీనివాస్, డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, ముంబయి మెడికల్ కాలేజీ డీన్ ప్రొఫెసర్ పల్లవి సప్రే, ఎయిమ్స్ న్యూరాలజీ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కేంద్ర కేబినెట్ సెక్రెటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్ పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఉంటారని సుప్రీం కోర్టు వెల్లడించింది. మూడు నెలల్లో మధ్యంతర నివేదిక అందజేయాలని టాస్క్ ఫోర్స్ ను ఆదేశించింది.
National Taskforce
Supreme Court
CJI Bench
RG kar Hospital
Kolkata Doctor

More Telugu News