KTR: ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదు: కేటీఆర్

KTR comments on parties which are not in any block in parliament elections
  • కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పలువురు నేతలు
  • పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణంలోనైనా తీర్పు రావచ్చన్న కేటీఆర్
  • స్టేషన్ ఘన్ పూర్ కి ఉప ఎన్నిక వస్తుందని జోస్యం
ఊసరవెల్లుల రాజ్యం చేస్తే తొండలు, ఉడుతలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని చెప్పారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. 

పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైనా హైకోర్టు తీర్పు రావచ్చని చెప్పారు. త్వరలోనే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికలో రాజయ్య ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాల్సిందేనని అన్నారు. స్వీకర్ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు రాజయ్య మాట్లాడుతూ... పార్టీని మోసం చేసి కడియం శ్రీహరి వెళ్లిపోయారని మండిపడ్డారు. శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని... ఎన్నో అవకాశాలు ఇచ్చిన పార్టీని మోసం చేశారని విమర్శించారు. రానున్న రోజుల్లో శ్రీహరికి ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. బీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
KTR
Rajaiah
BRS

More Telugu News