Chandranna Kanuka: ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకలు.. పంపిణీకి రెడీ అవుతున్న ప్రభుత్వం

AP govt ready to distribute Chandranna Kanukalu once again
  • టీడీపీ గత ప్రభుత్వంలోనూ చంద్రన్న కానుకల పంపిణీ
  • జగన్ అధికారంలోకి వచ్చాక పథకాల నిలిపివేత
  • ప్రభుత్వంపై ఏడాదికి రూ. 538 కోట్ల అదనపు భారం
తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతోంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా, ఇప్పుడు మళ్లీ వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు ప్రారంభించింది.

సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ. 2,690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద అరకేజీ కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, రూ. 100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు. 

అయితే, రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమపిండి, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే, రెగ్యులర్ కోటా కింద రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Chandranna Kanuka
Andhra Pradesh
Chandranna Ramzan Tohfa
Chandrababu

More Telugu News