Amitabh Bachchan: ఐశ్వర్య రాయ్‌తో విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్

Showing his wedding ring Abhishek Bachchan said Still married with Aishwarya Rai Bachchan
  • ఉంగరాన్ని చూపించి మరీ.. కలిసే ఉన్నామని స్పష్టం చేసిన అభిషేక్ బచ్చన్
  • ఈ విషయం గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదని వ్యాఖ్య
  • కథనాల కోసమే రాశారని అభిషేక్ అసహనం
  • సెలబ్రిటీలం కాబట్టి భరిస్తామని వ్యాఖ్య
బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతులు విడిపోయారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్లపై అభిషేక్ బచ్చన్ స్పందించాడు. పెళ్లి ఉంగరాన్ని చూపించిన ఆయన తాము కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘బాలీవుడ్ యూకే మీడియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు స్పష్టత ఇచ్చాడు. ‘‘ఆ విషయం గురించి మీ అందరితో నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు. దురదృష్టం కొద్దీ ఈ విషయాన్ని అంతటా వ్యాపింపజేశారు. కానీ మీరు ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలుసు. మీరు కొన్ని కథనాలు రాయాలి కాబట్టి రాశారు. కానీ ఏం ఫర్వాలేదు. మేము సెలబ్రిటీలం కాబట్టి దానిని భరించాలి’’ అని అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానించాడు.

కాగా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా పుకార్లు షీకార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి ఇద్దరూ వేర్వేరు హాజరయ్యాక ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. దీనికి తోడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘గ్రే డైవర్స్’కు (50 ఏళ్లు పైబడినవారు విడాకులు తీసుకోవడం) సంబంధించిన పోస్టుకు అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టడంతో విడాకుల అనుమానాన్ని మరింత బలపరిచింది. 

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 2011లో వారికి ఆరాధ్య పుట్టింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి ఫొటోలను ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కాగా వివాహానికి ముందు గురు, ధాయ్ అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, ధూమ్-2, ఉమ్రావ్ జాన్ సినిమాలలో ఇద్దరూ జంటగా నటించారు.
Amitabh Bachchan
Aishwarya Rai
Bollywood
Movie News

More Telugu News