Tamilnadu: తమిళనాడులో ఐదుగురు ఏపీ యువకుల దుర్మరణం

5 students dead after Truck collides with car at tiruvallur
  • తిరువళ్లూరులో విద్యార్థుల కారును ఢీ కొట్టిన ట్రక్కు
  • స్పాట్ లోనే ఐదుగురి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • మృతులంతా ఒంగోలుకు చెందిన వారేనన్న పోలీసులు
తమిళనాడులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారును రాంగ్ రూట్ లో ఎదురొచ్చిన ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా రామంజేరిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఏపీలోని ఒంగోలుకు చెందిన ఏడుగురు విద్యార్థులు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన విద్యార్థులు.. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. విద్యార్థులంతా ఒకే కారులో చెన్నైకి బయలుదేరారు. ఈ క్రమంలో తిరువళ్లూరు సమీపంలోకి చేరుకున్నాక వారి కారును ఓ కంటైనర్ ట్రక్కు ఢీ కొట్టింది.

చెన్నైకి 65 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చి ఢీ కొనడంతో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మిగతా ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. చనిపోయిన విద్యార్థులు.. నితీశ్ వర్మ, చేతన్, యుగేశ్, నితీశ్, రామ్మోహన్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. గాయపడ్డ చైతన్య, విష్ణులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కాగా, ఈ ఘోర ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Tamilnadu
Road Accident
AP Students
5 Dead
Tiruvalluru
Chennai

More Telugu News