Jagan: చంద్రబాబూ... ఇది పచ్చి మోసం కాదా?:జగన్

Jagan questions CM Chandrababu on election assurances
  • చంద్రబాబు హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న జగన్
  • అధికారంలోకి వచ్చాక తన నైజం బయటపెట్టుకున్నారని విమర్శలు
  • రెండున్నర నెలల్లోనే ఇంత దగా చేస్తారా అంటూ ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలకు తనదే హామీ అంటూ ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు... ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. 

"ఈ రాష్ట్రం బాధ్యత నాది అని ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, అయినప్పటికీ సంపద సృష్టిస్తానని, హామీలకు నాదీ గ్యారెంటీ అని అనేక పర్యాయాలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలపై ఉందంటూ చంద్రబాబు తన నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు... ఇది పచ్చి మోసం కాదా? 

చంద్రబాబూ... ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేటు ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోతోందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తల్లికి వందనం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నారు... కానీ ఇవ్వలేదు. రైతు భరోసా పథకంలో ప్రతి రైతుకు ఇస్తానన్న రూ.20 వేలు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రెండు త్రైమాసికాల డబ్బులు పెండింగ్ లో ఉంచారు. 

వసతి దీవెన పథకం అమలు చేయడంలేదు, సున్నా వడ్డీ పథకం లేనే లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు...  దాని జాడే లేదు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వడంలేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం, మత్స్యకార భరోసా, పంటలకు ఉచిత బీమా అడ్రస్సే లేదు. 

వాలంటీర్లను మోసం చేశారు. ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే విధానం ఆగిపోయింది. ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చే విధానం నిలిచిపోయింది. మధ్యాహ్న భోజన పథకంలో రోజుకో మెనూ విధానం మారిపోయింది. విద్యాకానుక కిట్ల పంపిణీ అరకొరగా సాగుతోంది. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యమేలుతోంది. మహిళలకు రక్షణ లేదు. చంద్రబాబూ... రెండున్నర నెలల్లోనే ఇంత దగా చేస్తారా? ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలు ఆపేసి... సూపర్ సిక్స్ హామీలను తు.చ. తప్పకుండా అమలు చేయండి" అంటూ జగన్ డిమాండ్ చేశారు.
Jagan
Chandrababu
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News