Jagan: పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు: జగన్

Jagan visits deceased party worker family in Nandyala district
  • నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్య
  • కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన జగన్
  • ఏజెంటుగా కూర్చున్నందుకు చంపేశారని ఆగ్రహం
  • పోలీసుల సమక్షంలోనే హత్యాకాండ జరిగిందని ఆరోపణ
  • చంద్రబాబు, లోకేశ్ లను కూడా ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్
నంద్యాల జిల్లా సీతారామాపురంలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పెద్దసుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారని వెల్లడించారు. పెద్దసుబ్బారాయుడి భార్యపై కూడా దాడి చేశారని మండిపడ్డారు. నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారని ఆరోపించారు. 

నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో అర్థమవుతోందని, ఈ కేసులో చంద్రబాబు, లోకేశ్ లను కూడా ముద్దాయిలుగా చేర్చాలని జగన్ డిమాండ్ చేశారు. ఏజెంటుగా కూర్చున్నందుకు హత్య చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్ లు పెట్టి, చంపాలని చెబుతున్నారని, హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలని అన్నారు. 

సీతారామాపురం గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఎందుకు అదనపు బలగాలను దించలేదని ప్రశ్నించారు. ఆ తర్వాత ఎస్సై సమక్షంలోనే మారణకాండకు దిగారని, నిందితులు గ్రామం వదిలి వెళ్లిపోయేవారకు వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. 

ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని, ఆధిపత్యం కోసం హత్యలు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. సీతారామాపురం ఘటనపై హైకోర్టుకు వెళతామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని స్పష్టం చేశారు.
Jagan
YSRCP
Nandyala District
Andhra Pradesh

More Telugu News