Jogi Ramesh: జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకుంటేనే కుట్ర కోణం వెలుగులోకి వస్తుంది.. హైకోర్టులో ఏపీ పోలీసుల వాదన

Chandrababu House Attack Case Police Wanted Jogi Ramesh Arrest
  • వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి
  • జోగి రమేశ్ ప్రోద్బలంతోనే టీడీపీ అధినేత ఇంటిపై 30-40 మంది దాడిచేశారని ఆరోపణ
  • ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
  • విచారణను ఈ నెల 13కు వాయిదా వేసిన న్యాయస్థానం
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో కుట్రకోణం ఉందని, దానిని వెలికి తీయాలంటే వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉంటుందని పోలీసుల తరపు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్ అయిన జోగి రమేశ్ ప్రోద్బలంతో 30 నుంచి 40 మంది చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చి దాడిచేశారని.. బయటకొస్తే చంపేస్తామంటూ చంద్రబాబును బెదిరించారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై అప్పట్లో నామమాత్రపు కేసులు పెట్టి కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు. అంతేకాదు పిటిషనర్, ఆయన అనుచరుల దాడిలో గాయపడిన వారిపైనే తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టారని కోర్టుకు వివరించారు. పిటిషనర్ జోగి రమేశ్‌కు ముందస్తు బెయిలు పొందే అర్హత కూడా లేదని తెలిపారు. వాదనల అనంతరం విచారణను కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.

చంద్రబాబు నివాసంపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంతో జోగి రమేశ్ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షతోనే తన క్లయింట్‌పై కేసు నమోదు చేశారని జోగి రమేశ్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిన్న విచారణ సమయం ముగియడంతో విచారణను న్యాయస్థానం 13కు వాయిదా వేసింది.
Jogi Ramesh
Chandrababu
Chandrababu House Attack Case
YSRCP
AP High Court

More Telugu News