Chandrababu: కలెక్టర్ల సమావేశం పెట్టి మరీ ప్రజావేదికను కూల్చేశారు.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

YCP Destruction Started With Prajavedika Demolition Says Chandrababu
  • ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ విధ్వంసం మొదలైందన్న సీఎం
  • గత ఐదేళ్లలో అన్ని రంగాలను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపణ
  • ఈ సమావేశం చరిత్రను తిరగ రాయబోతోందన్న చంద్రబాబు
  • తన పనితీరుపైనా రివ్యూ ఉంటుందని స్పష్టీకరణ
‘ప్రజావేదిక’ కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లతో సమావేశం పెట్టి మరీ వేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  గత ప్రభుత్వ అకృత్యాలను భరించలేకే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో చూసిన విధ్వంసం, బెదిరింపులు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు.

చిన్నచిన్న తప్పులంటే సరిచేయవచ్చని, కానీ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక ఆదాయం సంపాదించేది భారతీయులేనని, అందులోనూ 33 శాతం తెలుగువారే ఉన్నారని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రజలు తమను గెలిపించారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పారు. 

ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇకపై ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తుందని, నేటి కలెక్టర్ల సమావేశం చరిత్రను తిరగరాయబోతోందని పేర్కొన్నారు. తాను కూడా ఇకపై సమయపాలన పాటిస్తానని, తన పనితీరుపైనా రివ్యూ ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
Chandrababu
Collectors Conference
Amaravati
Telugudesam

More Telugu News