MS Dhoni: కోహ్లీతో క‌లిసి ఆడ‌టం స‌ర‌దాగా ఉండేది: ఎంఎస్ ధోనీ

MS Dhoni honest admission on his relationship with Virat Kohli
  • కోహ్లీతో తనకున్న స్నేహ‌బంధాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన ఎంఎస్‌డీ
  • ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో విరాట్ ఒక‌డని ప్ర‌శంస‌
  • క్రీజులో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా డ‌బుల్స్‌, త్రిపుల్స్ తీసేవాళ్లమ‌న్న ధోనీ
  • అది ఎల్లప్పుడూ సరదాగా ఉండేదని వ్యాఖ్య
భారత లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ర‌న్ మెషిన్‌ విరాట్ కోహ్లీతో తనకున్న స్నేహ‌బంధాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. భారత క్రికెట్‌లోని ఈ ఇద్దరు దిగ్గజాలు పరస్పరం కెప్టెన్సీలో కలిసి చాలా క్రికెట్ ఆడిన విష‌యం తెలిసిందే.  

కోహ్లీతో తన స్నేహం గురించి ధోనీ మాట్లాడుతూ... ‘‘ఇద్ద‌రం క‌లిసి భార‌త్‌కు చాలా కాలం ఆడాం. ప్రపంచ క్రికెట్ విషయానికి వస్తే అతను (కోహ్లీ) అత్యుత్తమ ఆటగాడు. మిడిల్ ఓవర్లలో నేను అతనితో చాలా బ్యాటింగ్ చేశాను. మేం క్రీజులో ఉన్న‌ప్పుడు, క‌లిసి బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు స‌ర‌దాగా ఉండేది. మేం ఎక్కువ‌గా డ‌బుల్స్‌, త్రిపుల్స్ తీసేవాళ్లం. కాబట్టి ఇది ఎల్లప్పుడూ సరదాగా ఉండేది. బ‌య‌ట క‌లిసేది త‌క్కువే. కానీ క‌లిసిన ప్ర‌తిసారి చాలా విష‌యాలు మాట్లాడుకుంటాం" అని ధోని చెప్పుకొచ్చాడు.

ఇక ధోనీ చివరిసారిగా ఐపీఎల్ 2024లో క్రికెట్ మైదానంలో కనిపించాడు. ఈసారి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఎంఎస్‌డీ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడాడు. కానీ, ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఈసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే, ధోనీ ప్రతి వేదిక వద్ద తనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులను మాత్రం అలరించాడు. 

పలు మ్యాచ్ ల్లో తక్కువ బంతులు మిగిలి ఉన్న దశలో క్రీజులోకి వ‌చ్చిన మ‌హేంద్రుడు త‌న‌దైన‌శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. ఇలా ఈ సీజ‌న్‌లో ధోనీ 11 ఇన్నింగ్స్‌లలో 53.66 సగటు, 220.54 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు. వాటిలో సిక్సులు, ఫోర్లతో వచ్చిన పరుగులే ఎక్కువ. ఈ సీజన్‌లో అతడి అత్యుత్తమ స్కోరు 37 (నాటౌట్). అలాగే మొత్తంగా 14 ఫోర్లు, 13 సిక్సర్‌లు బాదాడు. ఇంకా చెప్పాలంటే 2024 ఐపీఎల్‌లో మునుప‌టి ధోనీని గుర్తు చేశాడు.
MS Dhoni
Virat Kohli
Team India
Cricket
Sports News

More Telugu News