Raghuveera Reddy: చంద్రబాబు మడకశిర సభపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ప్రశంసలు

Congress Leader Raghuveera Reddy Praises AP CM Chandrababu Naidu
  • జనం తరలింపు, నిర్బంధాలు లేకుండా సభ సాదాసీదాగా నిర్వహించారన్న రఘువీరారెడ్డి
  • గత ప్రభుత్వ విధానాలకు చంద్రబాబు స్వస్తి చెప్పడం ఆనందంగా ఉందన్న మాజీమంత్రి
  • భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు వెళ్లాలని సూచన
  • ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ స్వాగతిస్తోందన్న రఘువీరా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. గురువారం మడకశిరలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంపై మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం వంటివి లేవని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఇలా సాదాసీదాగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు.

అలాగే, మడకశిర నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజలకు చంద్రబాబు స్పష్టమైన హామీలు ఇవ్వడంపైనా రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మడకశిరలో గత పదేళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించే శక్తిని దేవుడు చంద్రబాబుకు, ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి స్వస్తి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు అభినందనలు తెలిపారు. అగ్రవర్ణాల్లోని పేదలకు న్యాయం జరగాలంటే కులగణన చేపట్టాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Raghuveera Reddy
Congress
Chandrababu

More Telugu News