Air canada: దుప్పటి విషయంలో తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు!

Air Canada Flight Cancelled After Crew Members Meltdown Over Passengers Blanket Request
  • మొరాకోలో ఎయిర్ కెనడా విమానంలో శుక్రవారం ఘటన
  • దుప్పటి విషయంలో సిబ్బందికి, ప్యాసెంజర్‌కు మధ్య ఘర్షణ
  • వివాదం ముదరడంతో నిరసనగా విమానం దిగి వెళ్లిపోయిన ప్రయాణికులు, ఫ్లైట్ రద్దు
  • ఇతర సిబ్బంది సాయంతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చిన ఎయిర్‌లైన్స్
విమానం సిబ్బంది తీరుతో విసిగిపోయిన ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దయిన ఘటన మొరాకోలో శుక్రవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మాంట్రియాల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఓ ప్యాసెంజర్.. ఫ్లైట్ అటెండెంట్‌ను దుప్పటి ఇవ్వమని అడిగారు. ఏసీ కారణంగా చలి ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఫ్లైట్ అటెండెంట్‌కు, ప్యాసెంజర్‌కు మధ్య ఊహించని విధంగా వాగ్వాదం తలెత్తింది. 

ప్యాసెంజర్‌పై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఫ్లైట్ అటెండెంట్ మర్యాదగా నడుచుకోవాలని హెచ్చరించింది. ఆ తరువాత విమానం దిగిపోవాలని కోరింది. వెనక్కు తగ్గని ప్యాసెంజర్.. కెప్టెన్‌ను పిలుచుకురావాలని ఫ్లైట్ అటెండెంట్‌ను కోరారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఆమె తాను ప్యాసెంజర్ల బెదిరింపులకు లొంగిపోయేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, ఇతర ప్యాసెంజర్లు కూడా ఫ్లైట్ అటెండెంట్‌తో వాదనకు దిగారు. సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి దిగిపోయారు. దీంతో, ఫ్లైట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. 

విమాన సర్వీసు రద్దయిన మాట వాస్తవమేనని ఎయిర్ కెనడా ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర సిబ్బంది సాయంతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చామని పేర్కొంది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందుకు కారణమైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పింది. ఈ మేరకు ఎయిర్ కెనడా ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
Air canada
Flight Cancelled
Morocco
Montreal

More Telugu News