Hardik Pandya: లెగ్ స్పిన్ ప్రాక్టీస్ చేస్తున్న హార్దిక్ పాండ్యా.. ప్రయోగాలు మొదలుపెట్టిన కోచ్ గంభీర్!

Hardik Pandya bowled a leg spin during the net practice ahead of India vs Srilanka 1st T20i
  • ఫాస్ట్ బౌలర్‌‌లా బంతిని పట్టుకొని పరిగెడుతున్న సూర్యకుమార్ యాదవ్
  • సోషల్ మీడియాలో వైరల్‌గారిన ఫొటోలు
  • ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్
భారత్-శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. ఇవాళ (శనివారం) రాత్రి 7 గంటలకు ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. పల్లెకెలె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం భారత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఇది తొలి మ్యాచ్ కావడమే ఈ ఉత్కంఠకు కారణంగా ఉంది. దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే గంభీర్ జట్టుని ఏ విధంగా నడిపించబోతున్నాడనేది క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికి తోడు హార్దిక్ పాండ్యా స్థానంలో డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీని అప్పగించడం మరో ఆసక్తికర అంశంగా ఉంది. 

కాగా తొలి మ్యాచ్ కోసం ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. తొలి టీ20కి ముందు కెప్టెన్ సూర్య సహా ఇతర ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా గ్రౌండ్‌లో పలు ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా నెట్ ప్రాక్టీస్‌లో లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అది కూడా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే బౌలింగ్ శైలిని అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పేస్ బౌలర్‌ యాక్షన్‌ను తలపిస్తూ బాల్ పట్టుకొని పరిగెత్తడం కనిపించింది.

ఈ దృశ్యాలు చూసినవారు కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయోగాలు మొదలుపెట్టాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తన ప్రణాళికలు, కష్టపడి పనిచేసే తత్వం అతడిని చాలా ప్రత్యేకమైన కోచ్‌గా నిలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు భారత్ - శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది.
Hardik Pandya
Surya Kumar Yadav
Gautam Gambhir
India vs Srilanka
Cricket

More Telugu News