Annamayya District: మరో పెళ్లి చేసుకుందన్న అక్కసు.. చెట్టుకు కట్టేసి కర్రలు, గుడ్లతో దాడిచేసిన సాటి మహిళలు.. వీడియో ఇదిగో!

Woman was tied and attcked Inhuman incident in Annamayya District
  • అన్నమయ్య జిల్లా షికారిపాలెం గ్రామంలో ఘటన
  • భర్త నుంచి ఇటీవల విడిపోయిన మహిళ
  • మరో పెళ్లి చేసుకున్నట్టు తెలియడంతో మహిళల ఆగ్రహం
  • విడిపించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి సాటి మహిళలే ఆమెను చిత్రవధకు గురిచేశారు. జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో జరిగిందీ ఘటన. 

ఇటీవల భర్త నుంచి విడిపోయిన బాధిత మహిళ మరో పెళ్లి చేసుకున్నట్టు తెలియడంతో జీర్ణించుకోలేకపోయిన గ్రామంలోని మహిళలు ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆపై తప్పు చేసిందంటూ విచక్షణ రహితంగా ప్రవర్తించారు. కర్రలతో ఆమెను కొడుతూ, కోడిగుడ్లతో దాడిచేస్తూ ఆమెను నానా హింసకు గురిచేశారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె నుంచి ఫిర్యాదు అందుకున్న అనంతరం చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Annamayya District
Shikaripalem
Andhra Pradesh
Inhuman Incident
Crime News

More Telugu News