Kishan Reddy: కేంద్ర నిధులను తెలంగాణ ప్రభుత్వం దారి మళ్లిస్తోంది: కిషన్ రెడ్డి

Kishan Reddy slams Congress and BRS leaders
  • కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి చూపారంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
  • విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • మోదీని విమర్శించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీలు పడుతున్నారని వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి చూపారని కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీని విమర్శించడంలో పోటీలు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఓట్ల కోసమే తప్ప, ప్రజల కోసం నిధులు ఖర్చు చేయడంలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాదనల్లో నిజంలేదని స్పష్టం చేశారు. పునర్ విభజన చట్టం కింద తెలంగాణకు అనేక హామీలు అమలు చేశామని వెల్లడించారు. 

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, ఇప్పటికే రాష్ట్రంలో వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని వివరించారు. 

ఇక, రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామని, జాతీయ రహదారుల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జీఎస్టీ పరిహారం కింద రూ.7 వేల కోట్లు ఇచ్చామని, సాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.1,248 కోట్లు ఇస్తోందని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఈ విషయాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
Kishan Reddy
Budget
Telangana
BJP
Congress
BRS

More Telugu News