Nitish Kumar: నువ్వొక మహిళవు.. అసలు నీకేమైనా తెలుసా?.. అసెంబ్లీలో నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

Bihar Chief Minister Nitish Kumar lost his cool at the opposition in the Assembly on Wednesday
  • బీహార్‌లో ప్రత్యేక హోదా దక్కకపోవడంపై సభలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన
  • సీఎం నితీశ్ మాట్లాడుతుండగా నిరసనగా నినాదాలు
  • సహనం కోల్పోయి మహిళా ఎమ్మెల్యేపై చిందులు
కేంద్ర బడ్జెట్ 2024-25లో బీహార్‌కు ప్రత్యేక హోదా దక్కకపోవడంపై ఆ రాష్ట్ర విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రసంగిస్తున్న సమయంలో ఆందోళన చేపట్టారు. ‘సీఎం డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్..’’ అంటూ నినాదాలు చేశారు. విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో నితీశ్ కుమార్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆయన తన ప్రతాపాన్ని చూపించారు. ‘‘నువ్వొక మహిళవు. నీకేమైనా తెలుసా? చూడండి ఈమె మాట్లాడుతోంది. మహిళల కోసం మీరు (విపక్ష) ఏమైనా చేశారా?. సభలో మేం మాట్లాడుతాం. వినకపోతే అది మీ తప్పు’’ అంటూ ఆగ్రహించారు. 

సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై విపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే విషయంలో ఆయన నేరప్రవృత్తిని ప్రదర్శిస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు అవాంఛనీయం, అనాగరికం, అసభ్యకరం, నీచమైనవని ఆయన విమర్శించారు. స్త్రీలను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తేజస్వి యాదవ్ అన్నారు. ఆయన వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం గిరిజన వర్గానికి చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే అందంపై నితీశ్ కుమార్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తేజస్వి యాదవ్ ప్రస్తావించారు.
Nitish Kumar
Bihar
RJD
Tejashwi Yadav

More Telugu News