Gautam Gambhir: అజిత్ అగార్కర్, గంభీర్‌ లపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు

Kris Srikkanth is unimpressed by the explanation given by Ajit Agarkar and Gautam Gambhir over Hardik Pandya
  • ఫిట్‌నెస్ కారణంతో కెప్టెన్‌గా పాండ్యాను పక్కన పెట్టామనడం హేతుబద్ధంగా లేదని మండిపాటు
  • దీర్ఘకాల కెప్టెన్‌పై సూర్యను చూస్తున్నామంటూ ధైర్యంగా చెప్పాల్సిందని విమర్శ
  • ఐపీఎల్‌లో డ్రెసింగ్ రూమ్‌ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారేమోనంటూ ఆగ్రహం
భారత టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు సూర్య కుమార్ యాదవ్‌కు అప్పగించి.. హార్దిక్ పాండ్యాను విస్మరించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో క్రికెట్ మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా చేరారు. కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేయకపోవడానికి అతడి ఫిట్‌నెస్ ఒక కారణమంటూ ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్‌పై శ్రీకాంత్ మండిపడ్డారు. వారిద్దరు చెప్పిన కారణాలతో తాను పూర్తిగా ఏకీభవించబోనని, కేవలం ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే కెప్టెన్‌గా పాండ్యాను పక్కనపెట్టారని తాను భావించడంలేదని వ్యాఖ్యానించారు. 

హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి ముందుకు సాగాలని భావిస్తున్నామని, సూర్యను దీర్ఘకాలిక కెప్టెన్‌గా భావిస్తున్నట్టు ధైర్యంగా చెప్పాలని శ్రీకాంత్ అన్నారు. గతంలో తాను కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించానని, తాను ఆటగాళ్లను ఎంపిక చేశానని, ఆటగాళ్లను తొలగించి చాలా విమర్శలను ఎదుర్కొన్నానని ఆయన ప్రస్తావించారు. తానే దేవుడినని చెప్పడంలేదని, తాను కూడా తప్పులు చేశానని, అయితే పాండ్యా కెప్టెన్సీపై వివరణ ఇవ్వాలని శ్రీకాంత్ అన్నారు.

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జట్టు డ్రెస్సింగ్ రూమ్ నుంచి సెలెక్టర్లు ఫీ‌డ్‌బ్యాక్ తీసుకున్నారేమో అంటూ విమర్శించారు. ‘‘డ్రెసింగ్ రూమ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారేమో. బహుశా ఐపీఎల్ జట్టు డ్రెసింగ్ రూమ్ అభిప్రాయాలు తీసుకున్నారేమో. ఫిట్‌నెస్ ఆధారంగా కెప్టెన్సీ నుంచి పాండ్యాను తప్పించామనే కారణాన్ని నేను అంగీకరించను. అతడు(పాండ్యా) ఐపీఎల్ మొత్తం ఆడాడు. బౌలింగ్ కూడా చేశాడు. అయితే రాణించలేకపోయిన మాట కూడా నిజమే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించలేదు. ఆ తర్వాత టీ0 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు’’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

సూర్య కుమార్ యాదవ్‌కు ఒక మంచి కెప్టెన్‌గా ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని అంగీకరిస్తున్నానని, అయితే ఆ పాత్రకు హార్దిక్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడానికి ఫిట్‌నెస్ కారణం కాదని అన్నాడు. దీనికి కారణం తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. అగార్కర్, గౌతమ్ గంభీర్ చెప్పిన కారణాలు హేతుబద్ధంగా లేవని పేర్కొన్నారు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటగాడని, ఆయనంటే తనకూ ఇష్టమేనని తెలిపారు.
Gautam Gambhir
Ajit Agarkar
Krisnamachari Srikkanth
Cricket
BCCI

More Telugu News