YS Jagan: ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఢిల్లీ ధర్నాలో జగన్

Jagan Said 30 Murders In Andhra Pradesh Just In 45 Days
  • జంతర్‌మంతర్ వద్ద వైసీపీ ధర్నా
  • తాము ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు చూడాలని జాతీయ మీడియాను కోరిన వైసీపీ అధినేత
  • లోకేశ్ రెడ్‌బుక్ హోర్డింగులు రాష్ట్రమంతా ప్రదర్శించారన్న జగన్
  • 45 రోజుల్లో 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపణ
  • 300 మంది వలస వెళ్లిపోయారని ఆవేదన
  • 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయన్న జగన్
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష చేపట్టిన జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు కుమారుడు లోకేశ్ రెడ్‌బుక్ పట్టుకున్న ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్న, చంపుతున్న, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

ఈ రోజు వారు అధికారంలో ఉన్నారని, రేపు తాము అధికారంలోకి వస్తామని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి పాల్పడలేదన్నారు. తామెప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. కానీ, ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడాలని కోరారు. తాము ప్రదర్శించిన ఫొటోలు, వీడియోలు చూడాలని జాతీయ మీడియాను, నాయకులను జగన్ కోరారు.
YS Jagan
Delhi Protest
Andhra Pradesh
Jantar Mantar

More Telugu News