Union Budget 2024: కుర్చీని కాపాడుకునే బడ్జెట్: రాహుల్ గాంధీ

Kursi Bachao Budget congress Rahul Gandhi criticizes Union Budget 2024
  • బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత
  • మిత్రులను ఆనందింపజేసేందుకు సామాన్యులకు ఏమీ ప్రకటించలేదని ఆరోపణ
  • కాంగ్రెస్ మేనిఫెస్టో‌ను కాపీ-పేస్ట్ చేశారని మండిపాటు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్‌ను ‘కుర్చీని కాపాడుకునే బడ్జెట్’గా అభివర్ణించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘కాపీ అండ్ పేస్ట్’ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారని, ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశారని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బడ్జెట్ ద్వారా మిత్రులను ఆనందింపజేశారని, ఏఏలకు (అంబానీ, అంబానీ అనే అర్థంతో) ప్రయోజనం చేకూర్చేందుకు సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, మునుపటి బడ్జెట్లకు ‘కాపీ అండ్ పేస్ట్’ అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

నిరుద్యోగం ఉందని అంగీకరించారు: కాంగ్రెస్

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్ వేదికగా బడ్జెట్ 2024-25పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం బడ్జెట్ ఆకట్టుకోవడంపై మాత్రమే దృష్టిసారించిందని, చర్యలపై ఫోకస్ చేయలేదని పేర్కొంది. కాపీ-పేస్ట్ ప్రభుత్వం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నిరుద్యోగం జాతీయ సంక్షోభం అనే విషయాన్ని ఈ బడ్జెట్ ద్వారా కేంద్రం నిశ్శబ్దంగా అంగీకరించినట్టు అయిందని వ్యాఖ్యానించింది. రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నాయని ఈ బడ్జెట్ ద్వారా అర్థమవుతోందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Union Budget 2024
Budget 2024
Rahul Gandhi
BJP
Congress

More Telugu News