Assistant Commissioner Shanthi: మీ భర్త ఎవరో చెప్పండి.. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి నోటీసులు

Notices to endowments dept assistant commissioner shanthi
  • రికార్డుల్లో భర్త పేరు మదన్‌మెహన్‌గా పేర్కొన్నారంటూ శాంతికి నోటీసులు
  • మీడియా సమావేశంలో భర్త పేరు మరొకటి చెప్పడంపై వివరణ కోరిన ప్రభుత్వం
  • ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం 
  • శాంతిపై కొత్తగా తొమ్మిది అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం
సస్పెన్షన్‌లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు పంపారు. ‘‘దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె. మదన్‌మోహన్ అని సర్వీస్ రిజిస్టర్‌లో ఆమె నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి తొమ్మిది అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు. 

కొత్త అభియోగాలు ఏంటంటే..
  • విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్టు వెల్లడించడంపై అభియోగం నమోదు. 
  • దేవాదాయ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం
  • కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం నమోదు 
  • ‘ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సార్, మీరు పార్టీ వెన్నెముక’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు. 
  • విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్లోని మరో ఫ్లాట్‌లో నివాసితులతో గొడవపడగా, 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు. 
  • శాంతికి అధికారం లేకపోయినా సరే విశాఖపట్నం జిల్లా పరిధిలో వివిధ ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ అభియోగం.

శాంతి సహాయ కమిషనర్‌గా పని చేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏయే ఉల్లంఘనలకు పాల్పడ్డారు? అనేది పరిశీలించడానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నారు. 
Assistant Commissioner Shanthi
Endowments Department
Andhra Pradesh

More Telugu News