14-Hour Workday: ఐటీ ఉద్యోగులకు రోజుకు 14 గంటల పని... అమానుషం అంటూ మండిపడిన పురందేశ్వరి

Purandeswari terms proposed 14 hour workday by IT firms is inhuman
  • 14 గంటల పని విధానం అమలు చేయాలనుకుంటున్న ఐటీ కంపెనీలు
  • కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదన
  • ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారన్న పురందేశ్వరి
  • ఈ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించాలని విజ్ఞప్తి
ఐటీ ఉద్యోగులకు 14 గంటల పని విధానానికి అనుమతి ఇవ్వాలని బెంగళూరు ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. 

12 గంటల సాధారణ పని, రెండు గంటల అదనపు పని కలిపి మొత్తం 14 గంటల పని విధానం అమలు చేసేందుకే ఐటీ కంపెనీలు ప్రతిపాదన తీసుకురావడం అమానుషం అని పేర్కొన్నారు. ఈ 14 గంటల పని విధానం అమలు చేయడం అంటే, ఐటీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. 

పనిగంటల మార్పుతో రెండు షిఫ్టుల విధానం అమల్లోకి వస్తుందని, తద్వారా మూడింట ఒక వంతు మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని వివరించారు. దాంతో నిరుద్యోగం పెరుగుతుందని పేర్కొన్నారు. 

అంతేకాకుండా, పనిగంటల పెంపుతో ఉద్యోగం-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత దెబ్బతింటుందని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక సమయం పనిచేయడం వల్ల ఉద్యోగుల్లో నిరాసక్తత ఏర్పడుతుందని, తద్వారా ఉత్పాదకత తగ్గిపోతుందని పురందేశ్వరి వివరించారు. 

ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని, తద్వారా న్యాయబద్ధమైన, మానవీయ పని వాతావరణాన్ని కల్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పురందేశ్వరి ట్వీట్ చేశారు.
14-Hour Workday
Daggubati Purandeswari
IT Industry
Bengaluru
BJP
Congress
Karnataka

More Telugu News