Bangladesh: బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు... అత్యంత కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

Bangladesh Supreme Court orders to reduce reservations quota for freedom fighters family members
  • స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్
  • భగ్గుమన్న విద్యార్థులు, నిరుద్యోగులు
  • హింసాత్మకంగా మారిన నిరసనలు
  • ఇప్పటిదాకా 114 మంది మృతి
  • రిజర్వేషన్ల కోటాను 5 శాతానికి తగ్గించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు
బంగ్లాదేశ్ రిజర్వేషన్ల చిచ్చు తీవ్రస్థాయిలో రగులుతున్న వేళ ఆ దేశ సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. 

వివరాల్లోకి వెళితే... దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఇస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 

దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో విద్యార్థులు రోడ్లెక్కారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల హింస ప్రజ్వరిల్లగా, 114 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ షూట్ ఎట్  సైట్  ఆర్డర్స్ అమల్లో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఊరటనిచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కోటాను 30 నుంచి 5 శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దేశంలో 93 శాతం ఉద్యోగ నియామకాలు ప్రతిభ ఆధారంగా చేపట్టాలని, మిగిలిన 2 శాతం దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, మైనారిటీలకు కేటాయించాలని తీర్పు వెలువరించింది. 

ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగ్గా... షేక్ హసీనా ప్రభుత్వం నాలుగోసారి అధికారం చేపట్టింది. అయితే, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు భారీగా రిజర్వేషన్లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. 

ఢాకా యూనివర్సిటీలో మొదలైన ఘర్షణలు, కొద్ది వ్యవధిలోనే దేశమంతా పాకిపోయాయి. చివరికి సైన్యం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
Bangladesh
Supreme Court
Reservations
Freedom Fighters
Govt Jobs

More Telugu News