AP Rains: తీరానికి చేరువలో వాయుగుండం... ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy to heavy rain alert for North Coastal Andhra
  • వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
  • గత 3 గంటలుగా ఒకే ప్రాంతంలో స్థిరంగా వాయుగుండం
  • ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా కొనసాగుతోంది. 

ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ వాయవ్యంగా కదులుతూ, ఒడిశా-ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ తెలిపింది. 

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో  ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

ఏపీలో అనేక ప్రాంతాల్లో 5 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  
AP Rains
Depression
North Andhra
Coastal Andhra
Rayalaseema
IMD
APSDMA

More Telugu News