Elon Musk: అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

Elon Musk congratulates PM Modi on becoming most followed world leader on X
  • జూన్ 14న 100 మిలియన్లు దాటిన మోదీ ఫాలోవర్ల సంఖ్య
  • ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన మోదీ 
  • మోదీ ఘనతపై స్పందించిన మస్క్ 
ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్ ఎంట్రప్రెన్యూర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప్రధాని మోదీకి కంగ్రాట్స్’’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 

జులై 14న ఎక్స్‌‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా నెట్టింట పంచుకున్నారు. ఇంతటి ఉత్సాహభరిత వేదికలో ఉండటం తనకెంతో ఆనందమని కామెంట్ చేశారు. ఈ వేదికగా జరిగే చర్చలు, నిర్మాణాత్మక విమర్శలు, ప్రజలు ఇచ్చే దీవెనలు తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు కామెంట్ చేశారు. ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అందరినీ మించి మోదీ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. గ్లోబల్ సెలబ్రిటీలైన టేలర్ స్విఫ్ట్ (95.3 మిలియన్ ఫాలోవర్లు), లేడీ గాగా (83.1 మిలియన్లు), కిమ్ కర్డేషియన్ (75.2 మిలియన్లు) లను సైతం ఆయన మించిపోయారు. 

ఇక ప్రపంచరాజకీయ నేతలు ఎవరూ మోదీ దరిదాపుల్లో కూడా లేరు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా దుబాయ్ పాలకుడు షేక్ ముహమ్మద్‌కు 11.2 మిలియన్ల ఫాలోవర్లు, పోప్ ఫ్రాన్సిస్‌కు 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక క్రికెట్ ప్రపంచ స్టార్లు విరాట్ కోహ్లీ (64.1 మిలియన్ ఫాలోవర్లు), ఫుట్‌బాల్ స్టార్ నేమార్ జూనియర్ (63.6 మిలియన్), బాస్కెట్ బాల్ ప్లేయర్ లిబ్రాన్ జేమ్స్ (52.9 మిలియన్లు) కూడా వెనకబడే ఉన్నారు. 

కాగా, గత మూడేళ్లల్లోనే మోదీ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 30 మిలియన్ల మేర పెరిగింది. 2009లో ఎక్స్‌లో చేరిన మోదీ నాటి నుంచీ తన ఫాలోవర్లతో ఈ వేదికగా నిత్యం టచ్‌లో ఉంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందిరికీ ఎక్స్ వేదికగా బదులిస్తూ ఎవరినీ బ్లాక్ చేయకుండా తనదైన శైలిలో నెటిజన్ల అభిమానాన్ని చూరగొంటున్నారు.
Elon Musk
Narendra Modi

More Telugu News