Heavy Rains: ఉత్తరాంధ్రలో కుండపోత.. విశాఖ, విజయవాడలో విరిగిపడిన కొండచరియలు

Heavy Rains Lashes North Andhra And Other Parts In Andhra pradesh
  • వాయుగుండంగా మారిన అల్ప పీడనం
  • ఉప్పొంగిన వాగులు, వంకలు
  • నీట మునిగిన వేలాది ఎకరాల పంటలు
  • నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • కొట్టుకుపోయిన రోడ్లు.. గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా చేరుతున్న నీరు
  • విజయనగరం జిల్లా గోవిందపురంలో 203.25 మి.మీ వర్షం
కుండపోతగా కురిసిన వర్షం నిన్న ఉత్తరాంధ్రను కకావికలం చేసింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులకు గండ్లు పడడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

విజయవాడలోని కొండ ప్రాంతంలో రాళ్లు దొర్లిపడడంతో ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. విశాఖపట్టణంలో కొండచరియలు విరిగిపడి రెండు విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. ఓ ఇంటిగోడ ధ్వంసమైంది. గోదావరి పరీవాహక ప్రాంతంతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు చేరుతోంది. దీంతో నిన్న సాయంత్రానికి 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. 

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు-దాచారం మధ్య గుండేటివాగు వంతెన అప్రోచ్ రహదారి దెబ్బతింది. కన్నాయగూడెం-ఎర్రాయగూడెం మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. ఎన్టీఆర్ జిల్లా గంగలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు పొంగడంతో సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో 12 వేల హెక్టార్లలో వరిపంట మునిగింది.

గత 24 గంటల్లో విజయనగరం జిల్లా గోవిందపురంలో అత్యధికంగా 203.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాతకొప్పెర్లలో 165.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 154.25, శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో 139.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
Heavy Rains
Andhra Pradesh
North Andhra
Vijayawada
Visakhapatnam
Vizianagaram
Godavari River

More Telugu News