Jaahnavi Kandula: జాహ్నవి కందుల కుటుంబానికి ఊరట.. ఆ పోలీస్ ఉద్యోగం ఊడింది

US Cop Who Laughed After Indian Student Jaahnavi Kandulas Death Fired
  • సియాటిల్ లో పోలీస్ కారు ఢీ కొట్టడంతో మరణించిన జాహ్నవి
  • యాక్సిడెంట్ తర్వాత నవ్వుతూ మాట్లాడిన ఆఫీసర్ పై పోలీస్ బాస్ సీరియస్
  • అతడిని ఉద్యోగంలో కొనసాగించడం డిపార్ట్ మెంట్ కే అవమానమని వ్యాఖ్య
జాహ్నవి కందుల మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నవ్విన పోలీస్ ఆఫీసర్ కు తగిన శాస్తి జరిగింది.. పోలీస్ ఉద్యోగం ఊడింది. అలాంటి వ్యక్తి డిపార్ట్ మెంట్ లో ఉంటే తామందరికీ అవమానమేనని, అందుకే సదరు ఆఫీసర్ ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నామని సియాటిల్ పోలీస్ బాస్ తాజాగా వెల్లడించారు. దీంతో జాహ్నవి కందుల కుటుంబానికి కొంత ఊరట లభించినట్లైంది. సియాటిల్ లో పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవి కందుల మరణించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. సియాటిల్ లోని యూనివర్సిటీలో మాస్టర్స్ కోర్సులో చేరింది. ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతున్న జాహ్నవి కందులను పోలీస్ పెట్రోలింగ్ కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది. కారు నడిపిన పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ ఆ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ ప్రమాదం తర్వాత ఆందోళనతో మరో పోలీస్ ఆఫీసర్ డేనియల్ ఆడరర్ కు డేవ్ ఫోన్ చేశాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న డేనియల్.. జాహ్నవి మృతదేహాన్ని చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆపై హేళనగా నవ్వాడు. ఇదంతా బాడీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసి అమెరికాలోని తెలుగువారితో సహా భారతీయులు కూడా మండిపడ్డారు. ప్రమాదంలో ఓ మనిషి చనిపోతే విచారం వ్యక్తం చేయాల్సింది పోయి హేళనగా నవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో కెవిన్ డేవ్ అరెస్టు కాగా ఆఫీసర్ డేనియల్ ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ సియాటిల్ పోలీస్ చీఫ్ స్యూ రహర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

జాహ్నవి కందుల మరణంపై ఆఫీసర్ డేనియల్ చేసిన వ్యాఖ్యలు, ఆయన నవ్వు ఆమె కుటుంబ సభ్యులను ఎంతగా బాధపెట్టి ఉంటాయో అర్థం చేసుకోగలమని అన్నారు. డేనియల్ చర్యలు మొత్తం సియాటిల్ పోలీసులకే సిగ్గుచేటుగా మారాయని చెప్పారు. ప్రజలను కాపాడేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని నమ్మకం కలిగించేందుకు, ప్రజల కోసమే తాము ఉన్నామని చాటుకునేందుకు ఆఫీసర్ డేనియల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు రహర్ పేర్కొన్నారు.
Jaahnavi Kandula
Seattle
Car Accident
Police Officer Fired

More Telugu News