Dhammika Niroshana: శ్రీలంక మాజీ క్రికెటర్ హత్య.. భార్య, పిల్లల ముందే కాల్చివేత

The former Sri Lanka cricketer Dhammika Niroshana was shot dead
  • ధమ్మిక నిరోషణను నివాసంలోనే కాల్చిచంపిన దుండగుడు
  • అంబలంగోడాలో దారుణం
  • శ్రీలంక అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన నిరోషణ
  • జాతీయ జట్టులోకి ప్రవేశించక ముందే ముగిసిన కెరియర్
శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషణ (41) దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అంబలంగోడాలోని అతడి నివాసంలో భార్య, పిల్లల ముందే ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. హత్యకు పాల్పడ్డ దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేస్తున్నారు. దీనిని ముఠా కక్షలుగా భావిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు అన్వేషిస్తున్నట్టు శ్రీలంక పోలీసు అధికారులు వెల్లడించారు. 

నిరోషణ 2002లో శ్రీలంక అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫాస్ట్ బౌలర్ అయిన నిరోషణ శ్రీలంక జాతీయ జట్టుకు అతడు ఎంపిక కాలేకపోయాడు. తక్కువ వ్యవధిలోనే అతడి క్రికెట్ కెరియర్ ముగిసిపోయింది. 2000లో శ్రీలంక తరపున అండర్-19లోకి అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో గాలే స్పోర్ట్స్ క్లబ్ తరపున ఆడాడు. అండర్ -19 జట్టుకు నిరోషణ సారధ్యం వహించినప్పుడు ఏంజెలో మాథ్యూస్, ఉపుల్ తరంగ, ఫర్వీజ్ మహరూఫ్ జట్టులో ఉన్నారు. ఇక అతడు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 26.89 బౌలింగ్ సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే, 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 14.94 సగటుతో 269 పరుగులు చేశాడు.
Dhammika Niroshana
Sri Lanka
Cricket
Crime News

More Telugu News