Nara Lokesh: రాష్ట్రంలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీపై అధికారులతో చర్చించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh held review on 3220 lecturer posts recruitment
  • ఉన్నత విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష
  • న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్న లోకేశ్
  • పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని స్పష్టీకరణ
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ఉన్నత విద్య అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీ అంశంపై నేటి సమీక్ష సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి కసరత్తులు చేపట్టాలని లోకేశ్ స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని పేర్కొన్నారు. 

ఇక విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల మేర బకాయిలు ఇవ్వలేదని ఆరోపించారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా సంస్థల్లో ఉండిపోయాయని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గడంపై మంత్రి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీల్లో డ్రగ్స్ అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని, అందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారుల నియామకాన్ని పరిశీలించాలని అధికారులకు స్పష్టం చేశారు. డ్రగ్స్ పై చైతన్యం కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోవాలని అన్నారు. 
Nara Lokesh
Higher Education
Review
Lecturer Posts
Recruitment
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News