Joe Biden: మళ్లీ తడబడిన బైడెన్.. డెమోక్రాట్లలో టెన్షన్

Joe Biden battle box gaffe in speech on peaceful resolution post Trump attack
  • ట్రంప్ పై దాడి నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ ప్రసంగం
  • విభేదాలను బ్యాటిల్ బాక్సుల్లో పరిష్కరించుకుంటామన్న బైడెన్
  • బ్యాలెట్ కు బదులు బ్యాటిల్ అంటూ తడబడిన వైనం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు.. ట్రంప్ పై దాడి నేపథ్యంలో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ బ్యాలెట్ అని పలకాల్సింది కాస్తా బ్యాటిల్ అని పలికారు. దీంతో బైడెన్ మానసిక ఆరోగ్యంపై విమర్శలు చేస్తున్న వారికి మరో ఆయుధం దొరికినట్టయింది. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండగా బైడెన్ ఇలా వరుసగా తడబడడంతో నవ్వులపాలవుతున్నామని డెమోక్రాట్లు టెన్షన్ పడుతున్నారు. బైడెన్ ను అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై పోటీకి తానే సరైన అభ్యర్థినని బైడెన్ ఇదివరకే స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేదే లేదని తేల్చిచెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎన్నికల్లో గెలిచేది తానేనని పార్టీ నేతలకు చెబుతున్నారు.

తాజాగా ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండిస్తూ.. బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్‌ బాక్సును నమ్ముతాం. ఇప్పుడు కూడా మేం వాటిని బ్యాటిల్‌ బాక్సుల్లోనే పరిష్కరించుకొంటాం.. బుల్లెట్లతో కాదు’’ అని బైడెన్ అన్నారు. బ్యాలెట్ బాక్సులు అనాల్సిన చోట బ్యాటిల్ (యుద్ధం) బాక్సుల్లో పరిష్కరించుకుంటామని బైడెన్ పలకడంతో ఆయన సహాయకులు తలలు పట్టుకొన్నారు. అంతకు కొన్ని రోజుల ముందు కూడా నాటో సదస్సులోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పట్టుకుని పుతిన్ అని సంబోధించారు. డొనాల్డ్ ట్రంప్ ను అమెరికా వైస్ ప్రెసిడెంట్ అని బైడెన్ పేర్కొన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బైడెన్ ఆరోగ్య పరిస్థతిపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.
Joe Biden
Gaffe
Battle Box
Trump
Democrates

More Telugu News