Gruha Jyothi: ఉచిత విద్యుత్తు పొందలేకపోతున్నారా?.. ఇలా చేస్తే వచ్చే నెల నుంచి సున్నా బిల్లులు

Telangana Govt Good News For People Who Didnt Getting Zero Bills
  • దరఖాస్తులో లోపాల సవరణకు ప్రభుత్వం అవకాశం
  • ప్రజాపాలన సేవా కేంద్రాల్లో లోపాలు సరిచేసుకోవాలన్న ప్రభుత్వం
  • అద్దెదారులకూ గుడ్ న్యూస్.. ప్రజాపాలన పోర్టల్‌లోని ఎడిట్ ఆప్షన్  
ఉచిత విద్యుత్తు పొందేందుకు అర్హత ఉండీ పొందలేకపోతున్నవారు, అద్దెదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఫలితంగా మరో ఐదు లక్షలమంది వినియోగదారులు ఉచిత విద్యుత్తు ప్రయోజనాలు పొందబోతున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 7.24 లక్షల మంది వినియోగదారులకు గృహజ్యోతి పథకంలో భాగంగా ఈ నెలలో సున్నా బిల్లులు జారీ చేశారు. అయితే, దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోర్టల్ నమోదులో లోపాల కారణంగా అర్హత ఉన్నప్పటికీ ఎంతోమంది అనర్హులుగా మారారు. దీంతో విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది.

లోపాల సవరణకు అవకాశం కల్పించింది. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలు, పల్లెల్లో మండల కార్యాలయాల్లోని సేవా కేంద్రాలకు వెళ్లి విద్యుత్తు కనెక్షన్, రేషన్‌కార్డు అనుసంధానంలో లోపాలను సరిచేసుకోవచ్చని ఉచిత విద్యుత్తు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 

మరోవైపు, ఉద్యోగాలు, పిల్లల చదువు వంటి కారణాలతో ఇళ్లు మారే వారికి కూడా ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇలాంటి వారు ప్రజాపాలన పోర్టల్‌లోని ఎడిట్ ప్రక్రియతో పాత వివరాలు తొలగించి కొత్త ఇంటి వివరాలను నమోదు చేసుకుంటే సున్నా బిల్లులు జారీ అవుతాయని తెలిపింది.
Gruha Jyothi
Zero Bill
Telangana
Praja Palana

More Telugu News