Trump Rally Shooter: ఒంటరితనం.. తోటి విద్యార్థుల వేధింపులు.. ట్రంప్‌ షూటర్ నేపథ్యం ఇదీ!

Trump Rally Shooter Was Quiet Lonely And  Bullied In School
  • ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ 20 ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌
  • కేసును హత్యాయత్నంగా పరిగణిస్తూ పోలీసుల దర్యాప్తు
  • అతడు స్కూల్లో వేధింపులు ఎదుర్కొనేవాడన్న తోటి విద్యార్థులు
  • ఎవరితోనూ పెద్దగా కలవకపోయినా రాజకీయాలు, ట్రంప్‌ గురించి చర్చించేవాడని వెల్లడి
అమెరికా మాజీ అధ్యక్షుడిపై హత్యయాత్నానికి పాల్పడి సీక్రెట్ సర్వీసు పోలీసుల కాల్పుల్లో మరణించిన దుండగుడిని 20 ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు. ఈ కేసును హత్యాయత్నంగా పరిగణిస్తున్న పోలీసులు ఆ దిశగా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ట్రంప్‌కు గురిపెట్టిన తూటా తగిలి ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక కాల్పులకు తెగబడేందుకు క్రూక్స్‌ను పురిగొల్పిన పరిస్థితులు, అతడి నేపథ్యం గురించి తెలుసుకునేందుకు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, స్కూల్లో థామస్‌ క్రూక్స్‌తో కలిసి చదువుకున్న పలువురు అతడి గురించి కీలక విషయాలు వెల్లడించారు. అతడు దుస్తులు ధరించే తీరు కారణంగా తోటి విద్యార్థులు నిత్యం గేలి చేస్తూ ఉండేవారని తెలిపారు. క్రూక్స్‌ ఒంటరితనంతో బాధపడుతున్నట్టు కనిపించేవాడని అన్నారు. అయితే, క్రూక్స్‌ అప్పుడప్పుడూ వర్తమాన రాజకీయాలు, ట్రంప్‌ గురించి మాట్లాడేవాడని తెలిపారు. 

కాగా, క్రూక్స్‌ కారులో ఓ అనుమానాస్పద వస్తువును కూడా పోలీసులు గుర్తించారు. దీన్ని ప్రస్తుతం బాంబ్ టెక్నీషియన్లు పరీక్షిస్తున్నారు. పేలుడు పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అతడి ఫోన్‌లోని సమాచారం ఆధారంగా హత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, నిందితుడు ఉపయోగించిన గన్ సెమీఆటోమేటిక్ రైఫిల్ అని తెలిపారు. అతడి తండ్రి పేరిట ఈ ఆయుధం రిజిస్టరయి ఉందని, దాన్ని చట్టబద్ధంగానే కొనుగోలు చేసినట్టు గుర్తించామని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

ఇక క్రూక్స్‌కు మానసిక రుగ్మతలు ఉన్నట్టు ఇప్పటివరకూ ఏ ఆధారాలు దొరకలేదని కూడా అధికారులు తెలిపారు. అతడికి మిలిటరీ వ్యక్తులతో కూడా ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఒంటరిగానే ఈ హత్యయత్నానికి క్రూక్స్‌ పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. క్రూక్స్‌ రాజకీయ నేపథ్యంపై కూడా అస్పష్టత నెలకొంది. ట్రంప్ పార్టీ‌కి చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ గతంలో డెమోక్రటిక్ పార్టీకి కూడా విరాళమిచ్చినట్టు అధికారులు గుర్తించారు. అతడి డిస్కోర్డ్ సోషల్ మీడియాలో అకౌంట్‌లో రాజకీయపరమైన అంశాలు చర్చించిన ఆధారాలు కూడా దొరకలేదు. మరోవైపు, నిందితుడి తండ్రి కూడా మీడియాతో ఘటనపై స్పందించారు. తన కుమారుడి చర్యకు గల కారణాలను పూర్తిగా తెలుసుకున్నాకే స్పందిస్తానని పేర్కొన్నారు.
Trump Rally Shooter
USA
Donald Trump
Assasination Attempt

More Telugu News