Shanti: ఇదీ... సాయిరెడ్డి సార్ తో నాకున్న పరిచయం: శాంతి

Endowment Assistant Commissioner Shanti press meet over allegations
  • ఇటీవల ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం నుంచి సస్పెండైన శాంతి
  • శాంతిపై భర్త సంచలన ఆరోపణలు
  • తాను విదేశాల్లో ఉన్నప్పుడు, ఏపీలో ఉన్న భార్య గర్భం దాల్చిందని వెల్లడి
  • అందుకు విజయసాయిరెడ్డే కారణం అని ఆరోపణ
  • తాను ఎప్పుడో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్న శాంతి
దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని అతడు వెల్లడించాడు. తన భార్య గర్భానికి విజయసాయిరెడ్డి కారణమని తీవ్ర ఆరోపణ చేశాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వ్యవహారంపై చర్చ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో, శాంతి మీడియా ముందుకు వచ్చారు. 2013లో తనకు మదన్ మోహన్ తో వివాహం జరిగిందని ఆమె వెల్లడించారు. లా చదువుతుండగానే తమ ఇద్దరికీ పెళ్లయిందని వివరించారు. కానీ పెళ్లయ్యాక మదన్ మోహన్ తనను చాలా హింసించాడని శాంతి ఆరోపించారు. దాంతో 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. 

పిల్లలు, బంగారం, కారు విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కూడా రాసుకున్నామని తెలిపారు. మదన్ మోహన్ తో విడాకుల తర్వాత తాను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లాడానని శాంతి వెల్లడించారు. 

2021 వరకు తాను విశాఖలోనే ఉండేదాన్నని పేర్కొన్నారు. తాను మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ, మదన్ తనను వేధిస్తుండేవాడని ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చాక పిల్లలను మదన్ కు చూపించానని తెలిపారు. డబ్బు కోసమే అతడు ఇలాంటి అనుమానాలు సృష్టించేలా ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు. 

"నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. అదే వేరే కులానికి చెందిన దాన్నయితే ఇలా అనగలరా? ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు ధరించకూడదా? నేను కష్టపడి న్యాయవాద విద్యను చదివాను, అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేశాను. ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం నాకు లేదు. 

ఇక సాయిరెడ్డి సార్ గురించి చెప్పాల్సి వస్తే... ఆయనొక గౌరవనీయ వ్యక్తి. నేను విజయసాయిరెడ్డి సార్ ను మొదటిసారి విశాఖలోనే చూశాను. మాది నంద్యాల. రాయలసీమలో నాకు ఒక్క సర్పంచి కూడా తెలియదు. సీమలో ఆడపిల్లలు బయట ఊర్లు తిరిగేది ఉండదు. అలాంటిది ఒక ఎంపీ గారు పరిచయం అయ్యే సరికి, అబ్బ... ఇలా ఉంటుంది అనిపించింది. 

దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనే సంస్థ ఉంది. దీని వ్యవహారాలు చూసుకోవాల్సింది అసిస్టెంట్ కమిషనర్. ఆ ప్రేమ సమాజం సంస్థకు విశాఖ బీచ్ రోడ్ లో 30 ఎకరాల భూమి ఉంది. అందులో సాయి ప్రియా రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్లు ఆ 30 ఎకరాల భూమికి చాలా తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు. సాయిరెడ్డి సార్ ద్వారా ఆ విషయం నా దృష్టికి వచ్చింది. 

దాంతో నేను ఆ స్థలంలో ఇన్ స్పెక్షన్ కు వెళ్లాను. అక్కడి నిర్వాహకులతో మాట్లాడాను. లీజును పెంచడం ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసే ప్రయత్నం చేశాను. ఇదీ... సార్ తో నాకున్న పరిచయం" అంటూ శాంతి కన్నీటిపర్యంతమయ్యారు.
Shanti
Vijayasai Reddy
Assistant Commissioner
Endowment
Madan Mohan
Visakhapatnam

More Telugu News