Yuvraj Singh: ఆసీస్ పై ఫోర్లు, సిక్సర్లతో యువరాజ్ సింగ్ వీరవిహారం.. ఇదిగో వీడియో

Yuvraj Singh Still Owns Australia India Great Turns Back The Clock With Vintage Knock
  • నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 28 బంతుల్లోనే 59 పరుగులు బాదిన వెటరన్
  • వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ సెమీస్ లో భారత్ ఛాంపియన్స్ భారీ స్కోర్
  • యువరాజ్ బ్యాటింగ్ లో నేటికీ పవర్ తగ్గలేదంటున్న ఫ్యాన్స్
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. నార్త్ హాంప్టన్ లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ పై వీరవిహారం చేశాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 28 బంతుల్లోనే ఏకంగా 59 పరుగులతో సత్తా చాటాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. యువరాజ్ ఆడిన విధానం చూసి అతని బ్యాటింగ్ లో నేటికీ పవర్ తగ్గలేదని సంబరపడుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లలో గతంలో అతను బాగా రాణించాడంటూ గుర్తుచేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పాత ఫొటోలు, ఆసీస్ పై అతను సాధించిన భారీ స్కోర్లను నెట్ లో షేర్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో యువరాజ్ దూకుడుతో ఇండియా చాంపియన్స్ ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ లో ఇండియా చాంపియన్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. రాబిన్ ఊతప్ప 65 పరుగులు చేయగా యూసుఫ్ పఠాన్ 51 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 50 పరుగులు చేశారు. ఛేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ కేవలం 168 పరుగులకే చతికిలపడింది. మొత్తంగా ఏడు వికెట్లు కోల్పోయింది. ధావల్ కులకర్ణి, పవన్ నేగి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో ఇండియా ఛాంపియన్స్ జట్టు ఫైనల్ చేరుకుంది.

సురేష్ రైనా సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు ఫైనల్ లో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుతో శనివారం తలపడనుంది. గ్రూప్ స్టేజిలో పాక్ తో మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఇండియా ఛాంపియన్స్.. అందుకు ఫైనల్ లో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.
Yuvraj Singh
World Championship of Legends
Tournament
Northampton
India Champions
Australia Champions
Batting

More Telugu News