Chandrababu: మాజీ ఎమ్మెల్యే భార్యను గుర్తుపట్టి కాన్వాయ్ ఆపించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu stopped the convoy after noticing Ichavati wife of former TDP MLA late Siveri Soma
  • సచివాలయానికి వెళ్తూ కరకట్టపై మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇచ్చావతితో మాట్లాడిన సీఎం
  • కుమారుడి చదువు బాధ్యత తీసుకుంటానని హామీ
  • సామాన్యుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను సైతం ప్రత్యేకంగా గుర్తించి, గుర్తుపెట్టుకుంటారంటూ సీఎం చంద్రబాబు నాయుడుకి పేరు ఉంది. దీనిని రుజువు చేసే ఘటన ఒకటి శుక్రవారం జరిగింది. ఉండవల్లిలోని నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న ఆయన.. రోడ్డు పక్కన తన కోసం వేచిచూస్తున్న జనాల్లో ఉన్న టీడీపీ దివంగత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇచ్ఛావతిని గుర్తుపట్టారు. తన కుమారుడితో కలిసి వచ్చి కరకట్టపై వేచి ఉండడాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ ఆపించారు. కిందికి దిగి ఆమెను దగ్గరికి పిలిపించుకుని సీఎం మాట్లాడారు.

2018లో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో సివేరి సోమను మావోయిస్టులు హత్య చేశారు. దీంతో కుమారుడి బాధ్యతలు అన్నీ తానై చూసుకుంటున్న ఇచ్ఛావతికి సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా కల్పించారు.

తన కొడుకు చదువు విషయాన్ని ఇచ్చావతి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇక నుంచి చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉన్నత చదువుల విషయంలో సాయం చేస్తానని చెప్పారు. కాగా ఇచ్ఛావతితో పాటు మరికొందరు సామాన్యులతో కూడా చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. అందరి వద్ద వినతులు స్వీకరించిన ఆయన సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కారు దిగి వచ్చి తమతో మాట్లాడటంతో వినతులు అందించేందుకు వచ్చినవారు హర్షం వ్యక్తం చేశారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam
Siveri Soma
Siveri Etchavati
AP News

More Telugu News