Mamata Banerjee: మోదీ సర్కార్ అస్థిరంగా ఉంది... పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చు: మమతా బెనర్జీ

West Bengal CM Mamata Banerjee meets Sharad Pawar Uddhav Thackeray
  • దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందని వ్యాఖ్య
  • మోదీ హయాంలోనే అత్యయిక పరిస్థితి ఎక్కువగా ఉందని విమర్శ
  • బెంగాల్‌లో సీపీఎంతో పోరాడి అధికారంలోకి వచ్చామన్న మమతా బెనర్జీ
  • సీపీఎంతో సీట్ల సర్దుబాటు సాధ్యం కాదని స్పష్టీకరణ
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అస్థిరంగా ఉందని, పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చునని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. శుక్రవారం ముంబైకి వచ్చిన ఆమె శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత వీరితో భేటీ కావడం ఇదే మొదటిసారి. భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ... దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందన్నారు.

జూన్ 25వ తేదీని ప్రధాని మోదీ రాజ్యాంగ హత్యాదినంగా ప్రకటించడంపై కూడా ఆమె స్పందించారు. తాము ఎమర్జెన్సీకి వ్యతిరేకమని... మోదీ హయాంలోనే అత్యయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. మూడు కొత్త నేర న్యాయ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు ఎవరినీ సంప్రదించలేదన్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సమయంలో వాటిని ఆమోదించారని ఆరోపించారు. కొత్త చట్టాల విషయంలో చాలామందిలో ఆందోళన నెలకొందన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్‌తో పోరాడి తాము అధికారంలోకి వచ్చామని... ఈ నేపథ్యంలో అక్కడ సీపీఎంతో సర్దుబాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. ఇదే ఉత్సాహంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు.
Mamata Banerjee
NDA
Congress
BJP

More Telugu News