Electrocution in Swimming pool: స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా కరెంట్ షాక్.. 16 మందికి గాయాలు!

16 people injured after getting electrocuted in swimming pool in hyderabad
  • హైదరాబాద్ శివారులోని జల్‌పల్లిలో ఘటన
  • సరదాగా గడిపేందుకు అక్కడి ఫాంహౌస్‌కు వెళ్లిన మూడు కుటుంబాలు
  • స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతుండగా అనూహ్య ప్రమాదం
  • పూల్‌లో వైర్ తెగి 16 మందికి విద్యుదాఘాతం, ఇద్దరి పరిస్థితి విషమం
హైదరాబాద్ శివారు జల్‌పల్లి శివారులో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుదాఘాతంతో 16 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది ఆహ్లాదంగా గడిపేందుకు జల్‌పల్లిలోని ఫాంహౌస్‌కు గురువారం ఉదయం వెళ్లారు. 

సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని ఈతకొలనులోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా షాక్‌కు గురయ్యారు. కొలను మధ్యలోనే ఉన్న పర్వేజ్ (19),  ఇంతియాజ్ (22) రెండు నిమిషాల పాటు విద్యుదాఘాతానికి గురయ్యి తీవ్రంగా గాయపడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఈత కొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. కొలనులోపలి విద్యుత్ దీపాల కనెక్షన్లు లోపలి నుంచి కాకుండా బయట నుంచి ఇచ్చారన్నారు. ఈ వైరు కొలనులో తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం ఆయినట్లు పేర్కొన్నారు.
Electrocution in Swimming pool
Hyderabad
Jalpalli

More Telugu News