CISF personnel slapped: సీఐఎస్ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్ జెట్ మహిళా ఉద్యోగి అరెస్ట్.. ఆమెకు మద్దతుగా నిలిచిన ఎయిర్‌లైన్స్

SpiceJet staff arrested after she slaps CISF jawan airline alleges sexual harassment
  • జైపూర్ ఎయిర్‌పోర్టులో ఘటన
  • సీఐఎస్ఎఫ్ అధికారి తమ ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడాడన్న స్పైస్‌‌జెట్
  • ఘటనపై చట్టపరంగా చర్య తీసుకుంటామంటూ ప్రకటన విడుదల
జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అయితే, ఆమెకు అండగా నిలిచిన ఎయిర్‌లైన్స్ సదరు అధికారిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు తమ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగాడంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారుల ప్రకారం, అనురాధ రాణి అనే మహిళ స్పైస్‌జెట్ సంస్థలో ఫుడ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇతర సిబ్బందితో కలిసి ఆమె ఇటీవల ఉదయం 4 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నారు. ఆ గేటు మీదుగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు ఆమెకు తగిన అనుమతి లేదని అన్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోసం ఉద్దేశించిన స్క్రీనింగ్ పోస్టు వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించారు. అయితే, ఆ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయనకు, అనురాధ రాణికి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. 

అయితే, స్పైస్‌జెట్ సంస్థ మాత్రం ఈ ఘటనపై మరో వివరణ ఇచ్చింది. ఆమె అతని నుంచి అసభ్య పదజాలం, లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించింది. డ్యూటీ తరువాత తన ఇంటికి రావాలని తమ ఉద్యోగినిని సదరు అధికారి కోరినట్టు వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు పేర్కొంది.  లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగి తరపున ఎయిర్‌‌లైన్స్ పోలీసులను ఆశ్రయించింది.
CISF personnel slapped
Jaipur Airport
SpiceJet
Arrest

More Telugu News