Yanamala: ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ము జగన్ కు ఉందా?: యనమల

Yanamala asks Jagan have guts to respoind on economic survey
  • ఏపీలో గత ఐదేళ్లు విధ్వంసకర పాలన సాగిందన్న యనమల
  • ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వెల్లడి
  • ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు గొప్పలు చెప్పుకున్నారని విమర్శలు 
  • అందుకే ప్రజలు వైసీపీని ఓడించి బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ము జగన్ కు ఉందా? అని నిలదీశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిందో ఆర్థిక సర్వే 2022-23 ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. 

అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం, పారిశ్రామిక రంగం, విద్యుత్... ఇలా అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లు విధ్వంసకర పాలన కొనసాగిందని అన్నారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. అందుకే, ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి, తలరాతను తిరగరాశారని యనమల వ్యాఖ్యానించారు. 

వైసీపీ పాలనలో అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులను నరక కూపాలుగా తయారుచేశారని, ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చివేశారని విమర్శించారు.

ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులతో ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఇటువైపు చూడని పరిస్థితి నెలకొందని, ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయని అన్నారు. వ్యవసాయ రంగం పరిస్థితి మరీ దారుణమని, వందేళ్ల వ్యవసాయ రంగ చరిత్రలో పాతాళానికి పడిపోయిన దుస్థితిని వైసీపీ ప్రభుత్వంలోనే చూశామని యనమల విమర్శించారు. 

జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయిందని, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. జగన్ తప్పుడు విధానాలతో ఆక్వారంగం బలైందని యనమల పేర్కొన్నారు. ఆక్వా విద్యుత్ రేట్ల పెంపునకు తోడు అవినీతి కూడా ప్రభావం చూపిందని తెలిపారు.
Yanamala
Economic Survey
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News