Tamilnadu: కూలిపనులకు వెళ్తూనే చదువుకొని ఎన్ఐటీలో సీటు సాధించిన గిరిజన బాలిక

Tribal girl who worked as a daily wage worker gets admission at NIT Trichy
  • తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన రోహిణి ఘనత
  • కష్టపడి చదివి నీట్ ఎంట్రన్స్ లో 73.8 శాతం స్కోర్ సాధించిన వైనం
  • కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచి ఎంపిక.. ఫీజు మొత్తం చెల్లించనున్న స్టాలిన్ ప్రభుత్వం
ఆమె ఓ నిరుపేద గిరిజన యువతి.. ఏ రోజుకారోజు కూలిపనులకు వెళ్తేగానీ కడుపు నిండని కుటుంబంలో పుట్టింది. అయినా అందరిలా పెద్ద చదువులు చదవాలని గొప్ప కలలు కన్నది. వాటిని సాకారం చేసుకొనేందుకు ఎంతో శ్రమించింది. ఓవైపు తల్లిదండ్రులతోపాటు కూలి పనులకు వెళ్తూనే తీరిక సమయాల్లో కష్టపడి చదివింది. ఫలితం.. దేశంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన జేఈఈలో ఆమె సత్తా చాటింది. ఏకంగా 73.8 శాతం స్కోర్ సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీ) తిరుచ్చిలో సీటు సాధించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన గిరిజన బాలిక రోహిణి విజయగాథ ఇది. 

ఈ విజయం వెనక సాగిన కృషిని రోహిణి ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఏఎన్ ఐతో పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు రోహిణిని అభినందిస్తున్నారు. ఆమె యువతకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. 

ఏఎన్ ఐతో రోహిణి మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చదువుకున్నా. నా తల్లిదండ్రులు దినసరి కూలీలు. నేను కూడా కూలిపనులు చేశా. ఓవైపు పనులకు వెళ్తూనే మరోవైపు చదువుకున్నా. బాగా చదవడంతో సీటు వచ్చింది. మా స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్ల కృషి వల్లే నేను పరీక్ష బాగా రాశా’ అని చెప్పింది.

తనకు తిరుచ్చిలోని ఎన్ ఐటీలో సీటు వచ్చిందని.. కాలేజీ ఫీజునంతా తమిళనాడు ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చిందని రోహిణి వివరించింది. ఇందుకుగాను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలియజేసింది.

ఆ వీడియోలో రోహిణి కట్టెల పొయ్యిపై వంట చేయడం మొదలు తోట పనిచేయడం దాకా రోజువారీ ఇంటి పనుల్లో నిమగ్నం కావడం కనిపించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి దానికి 3 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి.
Tamilnadu
Thiruchirapally
ST student
cracks
NEET
NIT Trichy
Shows admit card
Video
Viral

More Telugu News