Gautam Gambhir: టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం

Gautam Gambhir appointed as Team India new head coach
  • టీమిండియా కోచ్ గా ముగిసిన రాహుల్ ద్రావిడ్ పదవీకాలం
  • గంభీరే తదుపరి కోచ్ అంటూ కొన్నాళ్లుగా వార్తలు
  • ఇవాళ అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ కార్యాదర్శి జై షా
టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను నియమించారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కు స్వాగతం పలుకుతున్నామని జై షా తెలిపారు. 

గంభీర్ టీమిండియా కోచింగ్ పగ్గాలు అందుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఆధునిక తరం క్రికెట్ ఎంతో వేగంగా పరిణామం చెందుతోందని, ఇప్పటి క్రికెట్ తీరుతెన్నుల పట్ల గంభీర్ కు నిశిత పరిజ్ఞానం ఉందని అభిప్రాయపడ్డారు. 

తన కెరీర్ లో గంభీర్ అనేక పాత్రలను సమర్థంగా నిర్వర్తించాడని, ఇప్పుడు భారత క్రికెట్ ను ముందుకు నడిపించడానికి గంభీర్ తగిన వ్యక్తి అని బలంగా నమ్ముతున్నానని జై షా వివరించారు. 

టీమిండియా పట్ల దార్శనికత, అపారమైన అనుభవం దృష్టిలో ఉంచుకుని చూస్తే... ఎంతో ఉద్విగ్నభరితమైన ఈ కోచింగ్ పదవిని చేపట్టడానికి అన్ని అర్హతలు ఉన్న వాడు గంభీరే అని అర్థమవుతుందని తెలిపారు. ఈ కొత్త ప్రస్థానం ప్రారంభిస్తున్న గంభీర్ కు బీసీసీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని జై షా వెల్లడించారు. 

ద్రావిడ్ కు ధన్యవాదాలు: జై షా

టీమిండియా కోచ్ గా సక్సెస్ ఫుల్ గా పదవీకాలం ముగించిన భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ కు జై షా కృతజ్ఞతలు తెలిపారు. కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం అత్యంత విజయవంతం అయిందని కొనియాడారు. ద్రావిడ్  మార్గదర్శకత్వంలో టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం సహా అన్ని ఫార్మాట్లలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని తెలిపారు.
Gautam Gambhir
Head Coach
Team India
BCCI

More Telugu News