Bhogapuram Airport: 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Union minister Ram Mohan Naidu visits Bhogapuram airport area
  • ఎల్లుండి భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు
  • నేడు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు
  • భోగాపురంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారని వెల్లడి
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఎల్లుండి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలనకు వస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కూడా రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్ పోర్టు గుండెకాయ వంటిదని అభివర్ణించారు. నిర్ణీత సమయంలోనే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని చెప్పారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పూర్తవుతాయని వివరించారు.

భోగాపురం ఎయిర్ పోర్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని రామ్మోహన్ నాయుడు  తెలిపారు. విమానాశ్రయ పనులపై సీఎం చంద్రబాబు సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. 

గత ప్రభుత్వం విమానాశ్రయ పనులను ఆలస్యం చేసిందని ఆరోపించారు. డిసెంబరు నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని చెప్పారు. చిన్న చిన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు.

విమానాశ్రయం పూర్తయితే దాదాపు 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా వాసులకు కూడా భోగాపురం ఎయిర్ పోర్టు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే, భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు ఎన్నో కంపెనీలు వస్తాయని తెలిపారు. 

గత ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయలేక, గడువులు పెంచుకుంటూ పోయిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్టును సందర్శించి, గడువు తేదీ చెబుతున్నామని, ఈ విషయాన్ని తాము ఓ బాధ్యతగా తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు వివరించారు. కేంద్రమంత్రిగా ఈ ఎయిర్ పోర్టుపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు.
Bhogapuram Airport
Kinjarapu Ram Mohan Naidu
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News