Volodymyr Zelensky: ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ క్రిమిన‌ల్‌ను మోదీ ఆలింగనం చేసుకోవ‌డం చాలా నిరాశను కలిగించింది: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

Volodymyr Zelensky says on PM Modi Putin meet in Moscow Huge disappointment
  • ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ బిజీ
  • మోదీ, పుతిన్ భేటీపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆగ్ర‌హం
  • ఇది శాంతి ప్రయత్నాలకు పెద్ద‌ దెబ్బ అని వ్యాఖ్య‌
భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం ఆయ‌న సోమ‌వారం ర‌ష్యా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ప్రధాని మోదీ కౌగిలించుకోవడంపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. 

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోదీ ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ క్రిమినల్‌ను ఆలింగనం చేసుకోవడం చాలా నిరాశను కలిగించిందని అన్నారు. ఈ భేటీని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో తీవ్రంగా ఖండించారు. మరోవైపు అదేరోజు రష్యా మిస్సైల్ దాడిలో 37 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని జెలెన్‌స్కీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

"ఇవాళ ఉక్రెయిన్‌పై ర‌ష్యా క్షిప‌ణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు స‌హా 37 మంది చ‌నిపోయారు. 13 మంది పిల్లలు సహా 170 మంది గాయపడ్డారు. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారులు చికిత్స పొందుతున్న‌ ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడి చేసింది. ఇలాంటి రోజున ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నేత‌ మాస్కోలో ప్రపంచంలోని అతిపెద్ద‌ క్రిమినల్‌ను కౌగిలించుకోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఇది శాంతి ప్రయత్నాలకు పెద్ద‌ దెబ్బ" అని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. 

కాగా, గత నెలలో ఇటలీలో జరిగిన 'జీ7' శిఖరాగ్ర సదస్సులో జెలెన్‌స్కీని మోదీ కలిశారు. ఆ స‌మ‌యంలో ఉక్రెయిన్ వివాదంపై శాంతియుత పరిష్కారానికి భార‌త్ మ‌ద్దుతు ఇస్తుంద‌ని, అలాగే దౌత్యప‌రంగా కూడా స‌హ‌కారాన్ని కొనసాగిస్తామ‌ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. కానీ, ఇప్పుడు పుతిన్‌తో భేటీ కావ‌డంపై జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Volodymyr Zelensky
PM Modi
Vladimir Putin
Moscow
Russia
Ukraine

More Telugu News