Virat Kohli: విరాట్ కోహ్లీ పబ్‌పై బెంగ‌ళూరు పోలీసుల కేసు.. కార‌ణం ఏంటంటే..!

Bengaluru Cops Slap FIR Against Virat Kohli Owned One8 Commune Pub
  • బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డు ప్రాంతంలోని కస్తూర్బా రోడ్‌లో ఉన్న 'వన్ 8కమ్యూన్' పబ్
  • నిర్ణీత సమయానికి మించి ప‌బ్‌ తెరిచి ఉండటంతో పోలీసుల కేసు నమోదు
  • ఈ నెల 6న కోహ్లీ ప‌బ్‌ అర్ధరాత్రి 1:20 గంటల వరకూ తెరిచి ఉండ‌డాన్ని గుర్తించిన పోలీసులు
భార‌త‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీకి చెందిన ఓ పబ్‌పై కేసు నమోదైంది. బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డు ప్రాంతంలోని కస్తూర్బా రోడ్‌లో ఉన్న కోహ్లీకి చెందిన 'వన్ 8కమ్యూన్' పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 6వ తేదీన‌ వన్‌ 8 కమ్యూన్‌ అర్ధరాత్రి 1:20 గంటల వరకూ తెరిచి ఉంచడాన్ని గుర్తించారు. దీంతో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచడంతో ప‌బ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఈ విషయమై బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మించి కస్టమర్లను అనుమతించిన 3 నుంచి 4 పబ్బులు, రెస్టారెంట్లపై కేసు నమోదు చేశామన్నారు. పబ్బులకు అర్ధరాత్రి 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచడానికి అనుమ‌తి ఉందని తెలిపారు. అర్ధరాత్రి భారీగా సౌండ్లు రావడంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయ‌న్నారు. దీంతో కోహ్లీ వన్ 8 కమ్యూన్‌ సహా సెంట్రల్ డివిజన్ పరిధిలో పలు రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

ఇక కోహ్లీ ఈ వన్‌ 8 కమ్యూన్ రెస్టారెంట్స్‌ అండ్ బార్స్ చైన్ వెంచ‌ర్‌ను 2017లో ప్రారంభించారు. కాగా, కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ ముగియ‌డంతో కోహ్లీ స్వదేశంలో సంబరాల అనంతరం లండన్‌ వెళ్లిపోయాడు. తన భార్య అనుష్కశర్మ, పిల్లలు వామిక, అకాయ్‌తో అక్కడే తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు.
Virat Kohli
One8 Commune Pub
Bengaluru
Team India
Cricket
Sports News

More Telugu News