Narendra Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అమెరికా కీలక విజ్ఞప్తి

America called  PM Narendra Modi to emphasize Ukraine territorial integrity as he met Putin
  • ఉక్రెయిన్ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ప్రస్తావించాలని సూచన
  • ఉక్రెయిన్ వివాదంపై తీర్మానం తీసుకొచ్చేలా కృషి చేయాలని అభ్యర్థన
  • భారత్-రష్యా సంబంధాలపై కొన్ని ఆందోళనలు ఉన్నాయని వ్యాఖ్య
ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అగ్రరాజ్యం అమెరికా కీలక విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించాలని కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో సోమవారం మాట్లాడారు. వాషింగ్టన్‌లో నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా ఈ విధంగా స్పందించింది.

ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉక్రెయిన్‌ వివాదం విషయంలో తీర్మానం చేయాలంటూ రష్యాతో చర్చలు జరిపే ప్రతి దేశాన్ని కోరుతుంటామని, ఇదే విషయాన్ని ఇప్పుడు భారత్‌కు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని మాథ్యూ మిల్లర్ అన్నారు.

అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని, సంపూర్ణమైన, స్పష్టమైన చర్చలు జరుపుతుంటామని మిల్లర్ అన్నారు. అయితే రష్యాతో భారత్ సంబంధాలపై తమకు ఆందోళనలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భారత్ ఏయే అంశాలపై చర్చలు జరపనుందనేది తనకు తెలియదని అన్నారు. 

భారత్‌తో అమెరికా బలమైన సంబంధాలను ఏర్పరచుకుందని, చైనాను కట్టడి చేయడంలో శక్తిమంతమైన భాగస్వామిగా భావించిందని, ఏడాది క్రితం అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు కూడా ఆహ్వానించారంటూ మిల్లర్ ప్రస్తావించారు. కాగా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి రష్యాతో భారత్ సుదీర్ఘ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను పాటించడానికి భారత్ నిరాకరించింది. పైగా రాయితీ లభించడంతో రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇంధన దిగుమతులు చేసుకుంది. ఇక ఐక్యరాజ్య సమితిలోనూ వ్యూహాత్మకంగా తటస్థంగా నిలిచింది. దీంతో రష్యా వైపే భారత్ మొగ్గు చూపినట్టయింది.
Narendra Modi
Vladimir Putin
Russia
India
USA
Ukraine

More Telugu News