Balcony for Rent: బాల్కనీకి టూలెట్.. అద్దె రూ.81 వేలు.. ఆశ్చర్యపోతున్న జనాలు

A Balcony In Sydney Has Been Listed For Rent At 81000 Per Month Internet Stunned
  • ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ఓ ఇంటి బాల్కనీ అద్దెకు ఉందంటూ యాడ్
  • బాల్కనీతో పాటు మంచం, అద్దం
  • అద్దె చూసి షాక్‌లో జనాలు, పరిస్థితి ఇంతలా దిగజారిందా అంటూ ఆందోళన
రూ.81 వేల అద్దె అంటే.. ఏ ఫోర్ బెడ్ రూం ఫ్లాటేమో.. ఖరీదైన ప్రాంతంలో ఉందేమో అని అనుకుంటాం. కానీ ఓ గదికి అనుబంధంగా పట్టుమని పది అడుగులు కూడా ఉండని బాల్కనీ అద్దె ఇలా వేలల్లో ఉందంటే నోరెళ్లబెట్టాల్సిందే. అందుకే ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది. సిడ్నీలోని ఓ ఇంట్లోని బాల్కనీ అద్దెకు ఇస్తామంటూ సంబంధిత వ్యక్తి ఈ ప్రకటన ఇచ్చారు.

ఈ బాల్కనీలో బెడ్‌తో పాటు అద్దం కూడా ఉంది. మంచి వెలుతురు ఉందని యాడ్‌లో చెప్పుకొచ్చారు. బాత్రూమ్ వంటివి గదిలోపల ఉంటాయని, వాడుకోవచ్చని చెప్పుకొచ్చారు. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వంటివి అదనమని అన్నారు. 

ఇక యాడ్ ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. కేవలం బాల్కనీకి ఇంత అద్దా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇందులో కూడా దిగేవాళ్లు ఉంటారా? అని మరికొందరు ఆశ్చర్యపోయారు. అంతా ద్రవ్యోల్బణం మహిమ అని మరికొందరు అన్నారు. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిపోయిందా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా, సిడ్నీలో ఇటీవల కాలంలో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. నానాటికీ డిమాండ్ పెరుగుతుండటంతో సరిపడా ఇల్లు దొరక్క అద్దెలకు రెక్కలొచ్చేశాయి. ఆర్థిక రంగం పుంజుకోవడం, జనాభా పెరుగుదల వంటివన్నీ అద్దెల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతో, మధ్య తరగతి వారు నరకయాతన పడుతున్నారు. అద్దె ఇళ్లకు పోటీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేలం పాటలో పాల్గొని మరీ ఇళ్లను దక్కించుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిపై ఆస్ట్రేలియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Balcony for Rent
Sydney
Australia

More Telugu News